ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ బాధ్యతని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రతిగా వారికి వేతనంతో కూడిన సెలవు (పెయిడ్ లీవ్స్) ఇస్తామని ప్రకటించింది. ఉపాధ్యాయులు ప్రతీరోజూ పాఠశాలలో డ్యూటీ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాలలో రోజుకి 5 నుంచి 7 ఇళ్ళలో సర్వే చేస్తారు. ఈవిదంగా 15-20 రోజులలో వారు సర్వే పూర్తి చేస్తారు. ఆ వివరాలను తర్వాత కంప్యూటర్లలోకి ఎక్కించి ప్రభుత్వానికి అందజేస్తారు. ఇది పేరుకి కులగణనే అయినప్పటికీ ఈ సర్వేలో ప్రతీ కుటుంబం యొక్క ఆర్ధిక, సామాజిక తదితర అన్ని వివరాలను సేకరిస్తారు. అందువల్లే సర్వేలో 50 ప్రశ్నలు ఉంటాయి.
ఈ కులగణన సర్వేలో పాల్గొనబోయే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన శిక్షణ ఇప్పించింది. సర్వే మొదలైన తర్వాత ఎదురయ్యే బయటపడే లోటుపాట్లు, సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించింది. ఈ నెలాఖరులోగా కులగణన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.