మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలపై నేడు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిపి రెంటినీ నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు.
ఇదివరకు కేటీఆర్ దావాపై విచారణ జరిపినప్పుడే న్యాయస్థానం మంత్రి కొండా సురేఖని మళ్ళీ ఎన్నడూ ఆవిదంగా మాట్లాడవద్దంటూ సున్నితంగా మందలించింది. సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర ఆన్లైన్ మీడియా నుంచి అక్కినేని నాగార్జున కుటుంబం, కేటీఆర్ని ఉద్దేశ్యించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలను, వీడియోలను తొలగించాలని సైబర్ పోలీసులను ఆదేశించింది. ఇప్పుడు నవంబర్ 13కి కేసు విచారణని వాయిదా వేయడం ద్వారా వారితో కోర్టు బయట రాజీ పడేందుకు మంత్రి కొండా సురేఖకి అవకాశం లభించిన్నట్లే భావించవచ్చు. ఆమె దీనిని సద్వినియోగపరుచుకుని ఈ కేసుల నుంచి బయటపడతారో న్యాయపోరాటలకే సిద్దపడతారో చూడాలి.