తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం వలన విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కనుక విద్యుత్ చార్జీల పెంపుకి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు జిల్లాల వారీగా బహిరంగ విచారణ జరుపుతోంది.
శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)లో దీనిపై ఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపట్టింది.
మాజీ మంత్రి కేటీఆర్ దీనికి హాజరయ్యి తన వాదనలు వినిపించారు. విద్యుత్ పంపిణీ అనేది ఓ బాధ్యత. రాష్ట్రాభివృద్ధికి దోహదపడేదే తప్ప రాష్ట్ర ఖజానాకి నిధులు సమకూర్చే వ్యవస్థ కాదు. కనుక ప్రభుత్వం దీనిని వ్యాపార దృక్పదంతో కాక సామాజిక బాధ్యతగానే నిర్వహించాలి. గతంలో మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించి దాంతో రైతులకు నీళ్ళు అందించినప్పుడు ఎవరిపైనా ఆ భారం మోపలేదు. ఎందుకంటే దానిని సామాజిక బాధ్యతగా భావించింది.
కనుక విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన, పెద్ద పరిశ్రమలను, చిన్న పరిశ్రమలను ఒకే కేటగిరీలోకి తీసుకురావాలనే ప్రతిపాదన రెండూ సరికావు. వాటి వలన చిన్న పరిశ్రమలు దివాళా తీస్తాయి. రాష్ట్రాభివృద్ధి నిలిచిపోతుంది.
చిన్న పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు ఎత్తివేయాలనే దురాలోచనతోనే ఈ ప్రతిపాదన చేసిన్నట్లు మేము భావిస్తున్నాము. కనుక వీటిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము,” అని కేటీఆర్ చెప్పారు.
విద్యుత్ చార్జీల పెంపుపై ఈ బహిరంగ విచారణలలో వచ్చిన ఇటువంటి అభిప్రాయాలూ, అభ్యంతరాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈ నెల 29వ తేదీన ఈఆర్‌సీ తుది నిర్ణయం ప్రకటిస్తుంది.