యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తాం: కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గుశాఖా మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ సర్వీసులను పొడిగిస్తాం. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే వేగంగా పనులు పూర్తవుతాయి.

ఇదివరకు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన చేశారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ కేసీఆర్‌ రాజకీయ కారణాలతో కేంద్రంపై కత్తులు దూస్తూ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా వదిలేశారు.

ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి దీనికి సహకరిస్తారనే ఆశిస్తున్నాము. ఒకవేళ సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వమే పూనుకొని యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తుంది.

హైదరాబాద్‌, తెలంగాణలో వివిద జిల్లాలతో సహా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు యాదాద్రికి తరలివస్తున్నారు. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తే భక్తులు అక్కడికి చేరుకోవడం చాలా సులువవుతుంది. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ ఉంటే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్నాము,” అని చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సముఖంగానే ఉందని, యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి అన్ని విదాల సహకరిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ఇదివరకే చెప్పారు. కనుక ఒకటి రెండేళ్ళలో యాదాద్రికి ఎంఎంటిఎస్ సేవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.