రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలతో సిఎం రేవంత్ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖాముఖి సమావేశమయ్యి, సుమారు 3 గంటల సేపు వారి సమస్యలపై చర్చించారు.
వారి ప్రధాన డిమాండ్ ఎంతో కాలంగా చెల్లించాల్సిన నాలుగు డీఏ బకాయిలపై సమావేశంలో చర్చించారు. వారి సమస్యల పట్ల సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, మంత్రులతో చర్చించి శనివారం సాయంత్రంలోగా డీఏ బకాయిలు చెల్లింపుపై నిర్ధిష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు.
దీని కోసం డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సీనియర్ నేత కె.కేశవరావు, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా సబ్ కమిటీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. వారు డీఏ బకాయిలతో పాటు, జీవో 317, ఉద్యోగుల ఇతర డిమాండ్లపై కూడా చర్చించి ముఖ్యమంత్రికి సిఫార్సులతో కూడిన ఓ నివేదిక ఇస్తారు. దాని ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్వీట్ చేశారు.