మంత్రి కొండా సురేఖకి ఉపశమనం లభించిన్నట్లేనా?

నేడు నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరిగింది. మంత్రి హోదాలో ఉండి ఆవిదంగా మాట్లాడటం సరికాదని, భవిష్యత్‌ మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించింది.

కేటీఆర్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబందించి వీడియోలను సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్‌ ఛానల్స్ నుంచి తక్షణం తొలగించాలని సైబర్ పోలీసులను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణని నవంబర్‌ 21వ తేదీకి వాయిదా వేసింది. 

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అయితే న్యాయస్థానం ఆమెను సున్నితంగా మందలించి ఈ కేసుని దాదాపు నెల రోజులకు వాయిదా వేయడం గమనిస్తే, ఈ కేసులో ఆమెకు ఊరట లభించిన్నట్లే భావించవచ్చు.

ఇదే అంశంపై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా ఆమెపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. బహుశః దానిలో కూడా ఆమెకు ఇదేవిదంగా మందలించి విడిచిపెట్టేయవచ్చు. కనుక ఆవేశంలో నోరుజారి ఇంత పెద్ద కేసులలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖకి వీటి నుంచి ఇంత త్వరగా బయటపడి ఉపశమనం పొందడం అదృష్టమే అని భావించవచ్చు.