ఆస్తుల కోసం రోడ్డున పడిన వైఎస్ కుటుంబం!

ఆస్తుల పంపకాలలో తనకు జగనన్న అన్యాయం చేశారనే ఉక్రోషంతోనే వైఎస్ షర్మిల తెలంగాణకు వచ్చేసి సొంత పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మళ్ళీ ఏపీకి తిరిగి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో అన్నపై ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశం లభించిన్నట్లయింది.

ఆమె తన అన్నపై నిత్యం నిప్పులు చెరుగుతూ ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో వైసీపిని చావు దెబ్బ తీశారు. ఆ ఉక్రోషంతో ఇప్పుడు జగన్‌ ఆమెకు, తల్లి విజయమ్మకి ఆస్తులలో వాటాలు ఇవ్వనంటూ సెప్టెంబర్‌ 10న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో పిటిషన్‌ వేసి, ఇదే విషయం తెలియజేస్తూ వారిరువురికీ నోటీసులు కూడా పంపారు.

ఇంతకాలం జగన్, షర్మిల ఇద్దరూ ఈ గొడవల గురించి బహిరంగంగా మాట్లాడకపోవడంతో వారిమద్య ఇంతగా విభేదాలు ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ఏపీలో ఇప్పుడు వారి ఆస్తుల పంచాయితీ హాట్ టాపిక్ అయ్యింది. మద్యలో టిడిపి కూడా దూరి ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటంతో దీని చుట్టూ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. 

జగన్‌ నిన్న విజయనగరం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలతో మాట్లాడుతూ, “ఇటువంటి గొడవలు ప్రతీ ఇంట్లో ఉండేవే. కానీ సిఎం చంద్రబాబు నాయుడు, ఆయనకు వంత పాడే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తదితర న్యూస్ ఛానల్స్ పనిగట్టుకొని మా ఫోటోలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు,” అని ఆరోపించారు.

జగన్‌ చెప్పిన ఈ మాటలపై వైఎస్ షర్మిల స్పందిస్తూ, “నిజమే చాలా ఇళ్ళలో ఆస్తుల గొడవలు ఉంటాయి. కానీ ఎవరూ ఇలాగ మా అన్నలాగ తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్వరు కదా? మరిది చిన్న విషయం ఎలా అవుతుంది జగన్‌ సర్? అని ప్రశ్నించారు. నిజమే కదా?