తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెపుతుంటే, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మూసీ నదీ గర్భంలో, మూసీకి ఇరువైపులా వందలాది చిన్నా పెద్దా ఇళ్ళున్నాయి. వాటన్నిటినీ కూల్చేసేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
కానీ ముందుగా నిర్వాసితులకు సమీపంలోని ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించి అక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ళతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.1.40 లక్షల రాయితీతో రూ.2 లక్షలు రుణాలు కూడా ప్రభుత్వం అందజేస్తోంది.
ఒకటి రెండు, మూడు అంతస్తుల భవనాలు నిర్మించుకున్నవారికి సమీప ప్రాంతాలలో 200 గజాల స్థలం, ఇళ్ళు నిర్మించుకునేందుకు రుణం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సమాచారం.
కానీ నేటికీ మూసీ వద్ద ఇళ్ళు నిర్మించుకున్నవారిలో చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు నిరాకరిస్తూ కోర్టుని ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపధ్యంలో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నేడు వారిని పరామర్శించి, తమ పార్టీ వారికి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.
“ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వలననే పేదలు మూసీలో ఇళ్ళు కట్టుకొని జీవించాల్సి వస్తోందని, వారికి తగిన పరిహారం చెల్లించకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాము వాటిలోకి వెళ్ళిపొమ్మనమని ఒత్తిడి చేయడం సరికాదు.
కొంతమంది 60-75 లక్షలు ఖర్చు చేసి ఇళ్ళు నిర్మించుకున్నారు. వాటికి ప్రభుత్వమే అన్ని అనుమతులు మంజూరు చేసింది. అటువంటప్పుడు ఆ ఇళ్ళు కూల్చివేయాలంటే వారికి అందుకు తగిన నష్టపరిహారం చెల్లించాలి కదా? మూసీ వాసులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేసే వరకు వారిని ఇక్కడి నుంచి ఎవరూ కదపలేరు. కదపాలని ప్రయత్నిస్తే మజ్లీస్ పార్టీ అడ్డుకుటుంది.
కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ పేదల ఇళ్ళు కూల్చివేస్తామంటే మజ్లీస్ పార్టీ అంగీకరించాడు. తప్పకుండా వారి తరపున పోరాడుతాము,” అని అక్బరుద్దీన్ హెచ్చరించారు.