ఫిరాయింపు ఎమ్మెల్యేలు మనకి అవసరమా?

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య చేయబడినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానంపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. గురువారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల ఆలోచనలు, నిర్ణయాలను ఓ కాంగ్రెస్‌ నాయకుడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషించాలో లేదా కాంగ్రెస్‌ విలువలని, రాజీవ్ గాంధీ ఆశయాలను కాదని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నందుకు బాధపడాలో అర్దం కావడం లేదు. 

ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకి అవసరమా? వారిని తెచ్చుకుని చంకనేక్కించుకొని వారికే అన్ని పదవులు కట్టబెడుతూ, చిరకాలంగా పార్టీకి సేవ చేస్తున్నవారిని దూరంగా పెట్టడం న్యాయమా? 

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ముఠా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఫిరాయింపులను కూడా క్రమబద్దీకరించిన ఘనుడు. తనతో కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు, నాయకులని ఆయన మాపైకి ఉసిగొల్పుతుంటే మేమందరం మౌనంగా భరించాల్సిందేనా?కాంగ్రెస్‌ కోసం కష్టపడిన మాకు ఇచ్చే గౌరవం ఇదేనా?

ఇటువంటి అవమానాలు భరించేందుకే ఇంకా మేము పార్టీలో ఉన్నామా?రాష్ట్ర కాంగ్రెస్‌ తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని తెలియజేస్తూ నేను మా జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి లేఖ ద్వారా తెలియజేశాను,” అని జీవన్ రెడ్డి చెప్పారు.