కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించింది. దానిని ప్రవేశపెట్టేందుకు వీలుగా రెండు మూడు నెలలపాటు రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రక్రియని సైతం నిలిపివేసింది. కానీ అంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో అనేక సాంకేతిక సమస్యలు, లోపాలు తలెత్తడంతో దాని పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించి ధరణి పోర్టల్‌ని సరిచేసి వినియోగించింది.
కానీ బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములు, పేదల భూములు కబ్జాలు చేసేందుకే కేసీఆర్ ధరణీ పోర్టల్ ప్రవేశపెట్టారని అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించేవారు. తాము అధికారంలోకి రాగానే ధరణీ పోర్టల్‌ని సమూలంగా ప్రక్షాళన చేసి పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు.
చెప్పిన్నట్లుగానే ధరణీ పోర్టల్ నిర్వహణ బాధ్యతలని కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ ఇన్ఫోర్మటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ధరణీ పోర్టల్ బాధ్యతలను ఎన్ఐసీ చూస్తుందని పేర్కొంది. అప్పటి నుంచి మూడేళ్ళపాటు అది నిర్వహిస్తుందని తెలియజేసింది.
కేసీఆర్ ప్రభుత్వం ‘టెర్రాసిస్’ అనే ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించగా అది భూరికార్డులను సరిగ్గా నిర్వహించలేకపోవడంతో సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి, ఈ రంగంలో మంచి అనుభవం, ట్రాక్ రికార్డ్ ఉన్న ఎన్ఐసీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.