హెచ్ఎండీఏ వెబ్సైట్లో కొన్ని వందల నిషేదిత లేఅవుట్లు దర్శనం ఇవ్వడంతో వాటిని వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాటిలో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారు, ఇళ్ళు కట్టుకుని నివాసం ఉంటున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అనేకమంది హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చి అధికారులకు మొరపెట్టుకొంటున్నారు. ఈ విషయం కమీషనర్‌గా సర్హరాజ్ అహ్మద్ దృష్టికి రావడంతో హెచ్ఎండీఏ డైరెక్టర్లతో సమావేశమయ్యి దీని గురించి చర్చించారు.
20 ఏళ్ళ క్రితం నాటి లేఅవుట్లని ఇప్పుడు ఆకస్మికంగా ఎవరు, ఎందుకు హెచ్ఎండీఏ వెబ్సైట్లో పెట్టారో కనుక్కోవాలని ఆధికారులను ఆదేశించారు. తక్షణం ఆ నిషేదిత లేఅవుట్ల జాబితాని వెబ్సైట్లో నుంచి తొలగించాలనే ఆయన ఆదేశం మేరకు అధికారులు వాటిని తొలగించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
హుడా, హెచ్ఎండీఏ ఏర్పడక మునుపు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో తుర్కయాంజిల్, బాలాపూర్, నాదల్ గుల్, గుర్రంగూడ, అబ్దుల్లాపూర్‌మెట్, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్, మన్నెగూడ తదితర ప్రాంతాలలో పుట్టగొడుగుల్లా పంచాయితీ లేఅవుట్లు వెలిశాయి.
వాటిలో చాలా వరకు 2007,2011,2015లో ఎల్ఆర్ఎస్లో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. కనుక ఇప్పుడు వాటిని నిషేదిత లే అవుట్లుగా చూపించడం సరికాదని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పి వాటన్నిటినీ హెచ్ఎండీఏ వెబ్సైట్లో నుంచి తొలగింపజేశారు.