నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన కేటీఆర్‌

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, బుధవారం నాంపల్లి కోర్టుకి హాజరయ్యి తన వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 20 నిమిషాల సేపు ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో కోర్టు సిబ్బంది రికార్డ్ చేశారు.

ఈ కేసులో సాక్షులుగా దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సాక్షులుగా రాగా వారిలో దాసోజు శ్రవణ్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మిగిలిన ముగ్గురి వాంగ్మూలాలు ఈ నెల 30వ తేదీన రికార్డ్ చేయనున్నారు. 

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెడలో దండ వేసిన ఫోటోని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేసి అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కొండా సురేఖ సహనం కోల్పోయి ఆవేశంలో కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్ల జీవితాలు కేటీఆర్‌ నాశనం చేశారని, వారిలో సమంత కూడా ఒకరంటూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

అందుకు ఆగ్రహించిన అక్కినేని నాగార్జునతో ఆమెపై వంద కోట్లకు పరువునష్టం దావా వేయగా, కేటీఆర్‌ కూడా ఆమెపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఆ కేసులోనే కేటీఆర్‌ నేడు నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వలన తన ప్రతిష్టకు భంగం కలిగిందని, కనుక ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ తన వాంగ్మూలంలో చెప్పారు. ఈరోజు ఆమె అక్కినేని నాగార్జున కేసులో కౌంటర్‌ దాఖలు చేశారు. తర్వాత కేటీఆర్‌ కేసులో వేరేగా కౌంటర్‌ దాఖలు చేయవలసి ఉంటుంది.