నోటీస్‌ ఇస్తే నేను ఇస్తా... తగ్గేదేలే: బండి సంజయ్‌

ఇదివరకు కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజూ వినిపించే మాటలు, వార్తలు ఒకలా ఉండేవి.  తెలంగాణ అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు, ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాలకు సంబందించి వార్తలే ఎక్కువగా వినిపించేవి. 

లేకుంటే కేసీఆర్‌ ఇంద్రుడు చంద్రుడు... దేశ్ కీ నేత అంటూ పొగిడే వార్తలు లేదా ఆయన ప్రధాని నరేంద్రమోడీని, కాంగ్రెస్ పార్టీని తిట్టిపోస్తున్న వార్తలు వినిపిస్తుండేవి. 

కానీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి పరిమితమైన తర్వాత తెలంగాణ రాజకీయాలలో కొత్త పదాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లు తెలంగాణలో మారుమ్రోగిపోతున్నాయి. 

ఆనాడు ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా వర్ణించబడిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సర్కార్ ‘అవినీతికి డ్యామ్’ అని వాదిస్తోంది. హైడ్రా కూల్చివేతల వార్తలు, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల సవాళ్ళు ప్రతిసవాళ్ళు రోజూ మూసీలో కొట్టుకువస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ఒకరిపై మరొకరు పరువు నష్టం కేసులు వేసుకొంతుండటంతో రోజూ ఆ వార్తలే వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున, కేటీఆర్‌ దావాలు వేశారు. తాజాగా కేటీఆర్‌ బండి సంజయ్‌కి లీగల్ నోటీస్‌ పంపించి ‘వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా’ అని హెచ్చరించారు. 

దానికి బండి సంజయ్‌ వెంటనే స్పందిస్తూ, నీ కధలన్నీ అందరికీ తెలుసు. నోటీసులు పంపితే భయపడిపోయేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. మళ్ళీ నోటీస్‌ అంటే ఈసారి నేనే నోటీస్‌ పంపిస్తా,” అని ఘాటుగా బదులిచ్చారు. కనుక ఇద్దరూ పరస్పరం నోటీసులు ఇచ్చుకోవడం ఖాయమే అని భావించవచ్చు.