తెలంగాణలో మరో పరువు నష్టం దావా?

తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య వరుసగా పరువు నష్టం దావాలు పడుతున్నాయి. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటుడు అక్కినేని నాగార్జున, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్‌ బీజేపీ ఎంపీ, కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీస్‌ పంపారు. 

తనకు ఫోన్‌ ట్యాపింగ్‌, మాదక ద్రవ్యాల వ్యవహారాలతో సంబంధం ఉందన్నట్లు మాట్లాడి తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. కనుక తనపై అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు వారం రోజులలోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకుంటేపరువు నష్టం దావా వేస్తానని నోటీసు ద్వారా హెచ్చరించారు. 

పదవి అధికారం ఉంది కదాని నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోమని ఇకపై తమపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేటీఆర్‌ హెచ్చరించారు. మరి కేటీఆర్‌ పంపిన ఈ నోటీసుపై బండి సంజయ్‌ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.