తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 162 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మరణించిన రైతులకు భీమా సొమ్ము అందించడానికి వారి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా చేయకుండా ఏఈవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా ఉద్యోగాలలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెన్షన్ ఆర్డర్ వారి చేతిలో పెట్టారు.
దీంతో షాక్ అయిన ఏఈవోలు హైదరాబాద్ చేరుకొని వ్యవసాయ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కానీ డైరెక్టర్ గోపీ వారితో మాట్లాడేందుకు ఇష్టపడకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ సంస్థ తరపున ఎవరూ స్పందించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు వారు అక్కడే బైటాయించి ధర్నా చేశారు.
వాస్తవానికి పంటల డిజిటల్ సర్వే చేసేందుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ కొడుకు కంపెనీ తయారుచేసిన మొబైల్ యాప్ తాము డౌన్‌లోడ్ చేసుకోలేదనే కక్షతోనే తమని సస్పెండ్ చేశారని వారు ఆరోపించారు.