సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) సంతోష్ అనే వ్యక్తి హత్య చేశాడు. నిన్న ఉదయం 8 గంటలకు గంగారెడ్డి మార్నింగ్ వాక్ పూర్తిచేసుకొని తన బైక్‌పై ఇంటికి తిరిగి వెళుతుండగా జగిత్యాలకు చెందిన బత్తిని సంతోష్ గౌడ్ అనే వ్యక్తి కారుతో వెనుక నుంచి బైక్‌ని ఢీకొట్టి, ఆయన కింద పడిపోయిన తర్వాత కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని స్థానికులు వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణం విడిచారు.
ఇందుకు నిరసనగా జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి జగిత్యాల్ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైటాయించి నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు హత్యకి గురవుతుండటం చాలా బాధాకరమని, దీనిని గంగారెడ్డి హత్యాగా భావించడం లేదని తనను హత్య చేసేందుకు జరిగిన కుట్రగానే భావిస్తున్నానని జీవన్ రెడ్డి అన్నారు.
సంతోష్ గౌడ్ తనని హత్య చేస్తానని ఇదివరకు చాలాసార్లు బెదిరించాడని, అప్పుడే గంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని కానీ పట్టించుకోలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే గంగారెడ్డి హత్య చేయబడ్డారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
గంగారెడ్డిని హత్య చేసిన బత్తిని సంతోష్ గౌడ్ స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.