డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఈ దీపావళి పండుగ ముందుగా రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 3,500-4,000 చొప్పున అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
నేడు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఘోషామహల్ నియోజకవర్గంలో ర్యాండమైజేషన్ పద్దతిలో కంప్యూటర్ ఎంపిక చేసిన 144 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు అందజేశారు.
ఈ కార్యక్రమం హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే నాలుగేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏ పని తలపెట్టినా బిఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తూ అడ్డుపడుతోందని, ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌లకు ఎన్నికలలో ఓడించి బుద్ధి చెప్పినా వారి బుద్ది ఇంకా మారలేదని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి ఉందని కాస్త ముందూ వెనకా అయినా ప్రతీ హామీని తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు.