ప్రభుత్వాలు మారితే పాలకుల ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలు మారడం సహజం. కానీ అందుకు సమాజం, సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాల్సివస్తే? ఇప్పుడు హైదరాబాద్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చెరువులు, ప్రభుత్వ భూములు కాపాడాలని నిర్ణయించి హైడ్రా ఏర్పాటు చేసింది. అదిప్పటికే అనేక ఇళ్ళు కూల్చివేసింది.
హైడ్రాకి చట్టబద్దత కల్పించి మరిన్ని అధికారాలు, సిబ్బంది కల్పించి దాని పరిధి పెంచడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
నగరం చుట్టుపక్కల వేసిన అనేక వందల లేఅవుట్లను హెచ్ఎండీఏ నిషేదిత జాబితాలో చేర్చడంతో వాటిని వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాటిని, వాటిలో నిర్మించిన బహుళ అంతస్తుల ఇళ్ళని కొనుగోలు చేసిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారు హెచ్ఎండీఏకి వినతిపత్రాలు సమర్పిస్తుండటంతో కమీషనర్ సర్పారాజ్ అహ్మద్ మంగళవారం హెచ్ఎండీఏ డైరెక్టర్లతో సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించారు.
నిషేదిత ప్రాంతాలలో ఇదివరకు లేఅవుట్లు వేసినప్పుడే రెవెన్యూ అధికారులు అడ్డుకోవలసి ఉంది. కానీ హెచ్ఎండీఏ ఏర్పాటు కాక మునుపు వాటిపై ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో అనుమతులు మంజూరు చేశారు. కొందరు అధికారులు లంచాలు తీసుకొని కొన్ని అక్రమ లేఅవుట్లకి అనుమతులు మంజూరు చేసి ఉండవచ్చు. అటువంటి లేఅవుట్లకి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి.
కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాటిని కొన్న ప్రజల తప్పిదం ఎంత ఉందో ప్రభుత్వం తప్పిదం కూడా అంతే ఉందని స్పష్టమవుతోంది. కనుక ఎవరూ నష్టపోకుండా తగిన విధానం రూపొందించుకొని ముందుకు సాగాలి.
కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయేలా చేస్తే అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా బాధితులు అందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారితే అది భవిష్యత్‌లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.