నిరుద్యోగులకు సిఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

ఈ నెల 21న గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, బీజేపీ తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఇద్దరూ నిరుద్యోగులను రెచ్చగొట్టి కీలకమైన మెయిన్స్‌కి అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగులు ఎంతగా ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోకుండా రకరకాల ఎత్తులు, జిత్తులతో పదేళ్ళు కాలక్షేపం చేసేసింది కానీ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే కేటీఆర్‌, బండి సంజయ్‌ ఇద్దరూ వచ్చి రాజకీయాలు చేస్తున్నారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

కేసీఆర్‌, కేటీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిరుద్యోగులని సచివాలయంలోకి రానిచ్చారా? వారి గోడు విన్నారా? మరి ఇప్పుడు ఎందుకు వారి కోసం మొసలి కన్నీళ్ళు కార్చుతూ రెచ్చగొడుతున్నారు? అని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.  

ఏళ్ళ తరబడి హైదరాబాద్‌లో హాస్టల్స్ లో పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో బిఆర్ఎస్, బీజేపీలు ఆడుకుంటున్నాయని, వాటి మాయలో పడి నష్టపోవద్దని సిఎం రేవంత్‌ రెడ్డి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జాబ్ క్యాలండర్‌ ప్రకారం వరుసగా నోటిఫికేషన్స్ వెలువడతాయని, కనుక అందరూ వాటికి సిద్దం అవ్వాలని విజ్ఞప్తి చేశారు.