ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అందుకే నిలిచిపోయింది: బండి సంజయ్‌

కేంద్రమంత్రి బండి సంజయ్‌ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “హర్యానా, జమ్మూ కశ్మీర్‌ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిన డబ్బు కేసీఆర్‌ పంపినదే. కాంగ్రెస్ పార్టీతో ఈ అవగాహన కుదిరినందునే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు అటకెక్కిపోయింది. ఆ కేసులో కేసీఆర్‌ ప్రధాన సూత్రధారి అని అరెస్ట్ అయిన నిందితులు చెపుతున్నా నోటీస్‌ ఇవ్వకపోవడానికి కారణం ఇదే. హర్యానా, జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల ఖర్చులకి కేసీఆర్‌ డబ్బు ఇవ్వలేదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. 

కేటీఆర్‌ ట్వీట్‌కి బదులిస్తూ “కేటీఆర్‌ అహంకారం వల్లనే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కేటీఆర్‌ అహంభావం వల్లనే కేసీఆర్‌కి ఈ దుస్థితి ఏర్పడింది,” అని విమర్శించారు. 

ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని బీజేపీ నేతలు, కాదు కాదు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలే కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్‌ నేతలు వాదించుకోవడం అందరూ విన్నదే. కానీ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా ఇంకా కుమ్మక్కు కబుర్లు వినిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.