కేంద్రమంత్రి బండి సంజయ్‌ అరెస్ట్!

అవును... కేంద్రమంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్ధులతో కలిసి బండి సంజయ్‌ ‘ఛలో సచివాలయం’ అంటూ ర్యాలీకి సిద్దమయ్యారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో బండి సంజయ్‌ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.

అభ్యర్ధుల భవిష్యత్‌కి, జీవితానికి సంబందించిన ఈ సమస్యని సిఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళేందుకు వారితో కలిసి సచివాలయం బయలుదేరితే తమని ఎందుకు అడ్డుకుంటున్నారని బండి సంజయ్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయనకు నచ్చజెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన వెంట బయలుదేరిన అభ్యర్ధులను కూడా పోలీసులు ఆరెస్ట్ చేసి వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. 

ఈ నెల 21న గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్లన్నిటినీ హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్ధులు భగ్గుమన్నారు.

నిన్నటి నుంచి అశోక్ నగర్‌లో నిరసనలు తెలియజేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఈరోజు వారిని కలిసేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ రావడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. అందువల్లే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించాల్సి వచ్చింది.