ఏపీ రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం

ఏపీలో ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఆలోచనలు, విధానాలు అన్నీ మారాయి. గత 5 ఏళ్ళుగా జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ ఏమీ చేయకుండా సంక్షేమ పధకాలతోనే కాలక్షేపం చేసి దిగిపోయింది. ఇప్పుడు ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించారు. 

ఇదివరకు అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో రూ.160 కోట్లు వ్యయంతో 3.62 ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తులతో సీఆర్‌డీఏ (ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) కార్యాలయం నిర్మాణ పనులు చేపట్టారు. కానీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో నిర్మాణ పనులన్నీ నిలిపివేసింది. అప్పటి నుంచి అమరావతిలో భవనాలు అలాగే ఖాళీగా పడున్నాయి. 

చంద్రబాబు నాయుడు ఈరోజు సీఆర్‌డీఏ కార్యాలయంలో మిగిలిన పనులు పునః ప్రారంభించారు. సీఆర్‌డీఏ కార్యాలయ భవన నిర్మాణం (సివిల్ వర్క్) ఇదివరకే పూర్తయింది. కనుక ఇప్పుడు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, 2.51 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు పూర్తిచేసేందుకు నేడు పనులు పునః ప్రారంభం అయ్యాయి. 6-9 నెలల్లోగా అన్ని పనులు పూర్తిచేసి కార్యాలయాన్ని అందుబాటులోకి తెస్తామని సంబందిత అధికారులు చెప్పారు. 

సీఆర్‌డీఏ కార్యాలయంతో  పాటు అమరావతిలో ఇతర కట్టడాలను కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఐదేళ్ళలో అమరావతికి రూపురేఖలు ఏర్పడి, రాజధాని మళ్ళీ కళకళలాడబోతోంది.