మూసీ నిర్వాసిత మహిళలకు చెక్కులు పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కోసం చాలా తిప్పలు పడాల్సివస్తోంది. ముందుగా మూసీనదిని ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్న సుమారు 10 వేల మందికి పైగా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించింది, కానీ వారు తమ జీవనోపాధి కోల్పోతున్నామంటూ ఇళ్ళు ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం రూ.3.44 కోట్లు మంజూరు చేసింది.

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేడు వారి వద్దకు వెళ్ళి 172 మంది మహిళలు సభ్యులుగా ఉన్న 17 స్వయం సహాయ సంఘాలకు చెక్కులు అందజేశారు. ఒక్కో మహిళకు రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం రుణం అందించి దానిలో రూ.1.40 లక్షలు రాయితీ ఇచ్చింది. ఆ సొమ్ముని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కనుక మహిళలు రూ.60 వేలు చెల్లిస్తే సరిపోతుంది. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకచోట స్థిరపడిన తర్వాత మరోచోటికి కుటుంబాలతో సహా తరలి వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు. కానీ ఏటా మూసీ నదికి వరదలు వచ్చినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు పడుతూ, మిగిలిన కాలంలో ఈ అపరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తూ ఆరోగ్యం పాడుచేసుకొని ఇబ్బందులు పడటం కంటే అన్ని విదాల సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలోకి మారడమే మంచిది.

మీరు ప్రభుత్వానికి సహకరించినందుకుగాను, ప్రభుత్వం కూడా మీ కష్టసుఖాలలో తోడుగా ఉంటూ అన్నివిదాల సాయ్పాడుతుంది. మీకు వ్యాపారాలలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. మీ పిల్లలకు ఉచితవిద్య అందిస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ త్యాగాల వలన హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోతాయి. అందుకు నగర ప్రజలు, ప్రభుత్వం ఎప్పటికీ మీరు ఋణపడి ఉంటుంది,” అని అన్నారు.