ఈ నెల 23వ తేదీన మంత్రివర్గ సమావేశంలో జరుగబోతోంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆరోజు సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుందని మంత్రులకు సచివాలయ అధికారులు సమాచారం అందించారు.
మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మూసీ ప్రక్షాళనలో ఎదురవుతున్న సమస్యలు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు, ఎన్నికల హామీల అమలు, హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదముద్ర, ఇంకా పరిశ్రమలు, పెట్టుబడుల గురించి చర్చించనున్నారు.
స్థిరాస్తుల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వరద నష్టం, పరిహారం చెల్లింపు, రైతు భరోసా తదితర అంశాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
కనుక ఆయా మంత్రిత్వ శాఖల ఆధికారులు వాటికి సంబందించి వివరాలు సిద్దం చేసుకుంటున్నారు. శాసనసభ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. బహుశః ఈ నెలాఖరుకి లేదా నవంబర్ మొదటివారంలో శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.