భారతదేశంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం లేదా సంస్కరణ అమలుచేయాలంటే ఎంత కష్టమో కేంద్రప్రభుత్వం జి.ఎస్.టి.బిల్లు ఆమోదానికి ప్రయత్నించినప్పుడు చూశాము. మళ్ళీ సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత జరిగిన రాద్దాంతం చూశాము. ఇప్పుడు నోట్ల రద్దుపై జరుగుతున్న రాద్దాంతాన్ని చూస్తున్నాము. దేశంలో సామాన్యప్రజల కంటే ఎక్కువగా వారికోసం ప్రతిపక్ష పార్టీలు చాలా బాధ పడిపోతున్నాయి. దేశంలో జరుగరానిది ఏదో జరిగిపోతోందన్నట్లు అన్ని పార్టీలు కలిసికట్టుగా దుష్ప్రచారం చేస్తూ, రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో మోడీ ప్రభుత్వం యుద్ధం చేయడానికి సిద్దం అవుతున్నాయి.
కేంద్రప్రభుత్వం ప్రతిపక్షాలతోనే కాదు..న్యాయస్థానాలలో కూడా న్యాయపోరాటాలు చేయవలసి వస్తోంది. కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన సామాన్యప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కనుక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో 4 ప్రజాహిత పిటిషన్లు దాఖలయ్యాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్. టాకూర్, జస్టిస్ డివై చంద్రచూడ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాటిని ఈరోజు విచారణకి చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదించారు. కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో, దాని వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో ఆయన ధర్మాసనానికి వివరించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం నాలుగు పిటిషన్లని కొట్టివేసింది. నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి అఫిడవిట్ ద్వారా తెలియజేయమని ఆదేశిస్తూ ఈ కేసుని ఈనెల 25కి వాయిదా వేసింది.