దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడున్నర దశాబ్ధాల తర్వాత న్యాయదేవత కళ్ళు తెరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చొరవ తీసుకొని న్యాయదేవత విగ్రహంలో కొన్ని మార్పులు చేశారు.
బ్రిటిష్ కాలం నుంచి న్యాయదేవత విగ్రహం కళ్ళకు నల్లటి రిబ్బన్ కట్టి ఉండేది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నిన్న దానిని తొలగించారు. అదేవిదంగా నేరస్తులను కటినంగా శిక్షిస్తుందని సూచించేందుకు న్యాయదేవత కుడిచేతిలో ఖడ్గం ఉండేది. దానిని తొలగించి భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఉంచారు.
ఈ మార్పులతో తయారుచేయించిన న్యాయదేవత విగ్రహాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు గ్రంధాలయం ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఇకపై న్యాయదేవత కళ్ళు తెరిచి చూస్తూ రాజ్యాంగం ప్రకారమే న్యాయన్యాయాలను నిర్ణయిస్తుందని సూచించిన్నట్లయింది. కనుక ఇకపై దేశవ్యాప్తంగా, అలాగే సినిమాలలో కూడా న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు కనిపించనున్నాయి.
బ్రిటిష్ కాలంనాటి పేర్లు, గుర్తులను మారుస్తున్నందున న్యాయస్థానాలలో ‘మిలార్డ్’ అంటూ న్యాయమూర్తులను సంభోదించడం, నల్లటి దుస్తులు ధరించడం వంటి బ్రిటిష్ ఆనవాయితీలను కూడా తొలగించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభింబించేవిదంగా మార్పులు చేస్తే బాగుంటుంది. అలాగే సుప్రీంకోర్టు మొదలు, జిల్లా కోర్టు వరకు తీర్పులు ఎప్పటికప్పుడు అన్ని భారతీయభాషలలో అనువదించబడితే బాగుంటుంది.