వరంగల్, హనుమకొండ జిల్లాలలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం హనుమకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. తాము 2017 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, కానీ ప్రభుత్వం ఇంతవరకు తమని రెగ్యులరైజ్ చేయలేదని నిరసనలు తెలుపుతూ హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి నక్కల గుట్టలోని విద్యుత్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
విద్యుత్ భవన్ ఎదుట బైటాయించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పి శాంతింపజెసేందుకు ప్రయత్నించినా శాంతించలేదు.
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ ఐకాస ఛైర్మన్ ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, “2017లో మొత్తం 23,667 మందిని ఈ ఉద్యోగాలలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పనిచేస్తున్నాము. కొంత మంది విధి నిర్వహణలో చనిపోగా మరికొందరు ఈ ఉద్యోగాలపై ఆశలు వదులుకొని వెళ్ళిపోయారు. ప్రస్తుతం 19,587 మంది మాత్రమే మిగిలాము.
ఎన్పీడీసీఎల్‌కి మా అవసరం ఉంది కనుకనే ఇంత మందిని నియమించుకొని ఇన్నేళ్ళుగా పనిచేయించుకుంటోంది కదా? మమ్మల్ని కూడా ఎన్పీడీసీఎల్లోకి తీసుకునేందుకు మరి దేనికి అభ్యంతరం? ప్రభుత్వం మాచేత పనులు చేయించుకుంటున్నప్పుడు మా కష్టానష్టాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా? కానీ మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు?
ఇకనైనా మా అందరినీ రెగ్యులరైజ్ చేసి ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు ఇస్తున్నట్లే జీతభత్యాలు ఇవ్వాలి. లేకుంటే మా ఆందోళన ఉదృతం చేస్తాం,” అని ఈశ్వరరావు హెచ్చరించారు.
ఈ ర్యాలీలో హనుమకొండ సీఐటీయు కార్యదర్శి రమేష్, ఐకాస నాయకులు శంకర్, చంద్రా రెడ్డి, సదానందం, అరవింద్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.