ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో కూడా మొట్టికాయలు పడటంతో అయిష్టంగానే ప్రభుత్వం నుంచి రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకొని పొరుగు రాష్ట్రానికి వెళ్ళక తప్పలేదు. తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఆమ్రపాళీ, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రాస్‌లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయగా వారు బుధవారం సాయంత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
ఇదేవిదంగా ఏపీ నుంచి సృజన, శివ శంకర్, హరి కిరణ్‌లకు కూడా హైకోర్టులో మొట్టికాయలు పడటంతో వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయగా వారు ముగ్గురూ నిన్న సాయంత్రం తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
రాష్ట్ర విభజన సమయంలోనే వారు ఏపీ, తెలంగాణలకు కేటాయించబడ్డారు. కానీ వెళ్ళకుండా ఇన్నేళ్ళుగా ఏపీ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో, తెలంగాణ క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు ఏపీలో పనిచేస్తున్నారు.
తాజాగా డీఓపీటీ ఆదేశించినా వెళ్ళేందుకు ఇష్టపడక ట్రిబ్యూనల్‌లో పిటిషన్లు వేయగా తప్పనిసరిగా వెళ్ళాల్సిందే అని చెప్పడంతో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా సున్నితంగా మందలించి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పడంతో అయిష్టంగానే వెళ్ళారు. వారికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏ శాఖలు, పోస్టులు అప్పగిస్తాయో చూడాలి.