వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్‌కి శంకుస్థాపన

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం వద్ద గల దట్టమైన అడవుల నడుమ ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ (వీఎల్ఎఫ్) రాడార్ కేంద్రం ఏర్పాటుకి నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌, సిఎం రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్, విశాఖలోని ఈస్ట్రన్ నేవీ కమాండ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

దామగుండం అడవులలో ఈ రాడార్ కేంద్రం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 2,900 ఎకరాలు కేటాయించింది. అక్కడ రాడార్ కేంద్రంలో సుమారు 600 మంది ఉద్యోగులు, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఇతర సిబ్బంది ఉంటారు. వారి కుటుంబాలతో కలిపి సుమారు 3,000 మందికి పైగా అక్కడ నివసిస్తారు. కనుక వారి కొరకు మార్కెట్, స్కూల్ తదితర సకల సౌకర్యాలతో పెద్ద టౌన్ షిప్ నిర్మించబోతున్నారు. దీని నిర్మాణ పనులు 2027లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 


ఈ రాడార్ స్టేషన్, టౌన్ షిప్ కోసం వికారాబాద్‌ని ఎంచుకోవడం చాలా సంతోషమే కానీ దాని కోసం 2900 ఎకరాలలో దట్టమైన అడవులు నరికివేయాల్సి వస్తుందని, అందువల్ల అక్కడ నివసించే జంతువులు, పక్షులు, ఇతర జీవరాశి నశించిపోతాయని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెపుతున్నారు. కానీ పర్యావరణానికి నష్టం కలుగకుండా అవసరమైన మేరకే చెట్లు తొలగిస్తామని నేవీ అధికారులు హామీ ఇస్తున్నారు.