పాత నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు ఎప్పుడూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు కానీ సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కి ఆ ఇబ్బందులు తప్పలేదు. ఈరోజు ఉదయం ఆమె అహ్మదాబాద్ లో తన ఖాతా ఉన్న బ్యాంక్ కి వచ్చి తన వద్ద ఉన్న పాత నోట్లని మార్చుకొని వెళ్ళారు. ఆమెకి ఆ అవసరమే లేదు. ఆమె కోరుకొంటే బ్యాంక్ వాళ్ళే ఇంటికి వచ్చి నోట్లు ఇచ్చి వెళతారు. కానీ చాలా నిరాడంబరంగా జీవించే ఆమె దేశంలో సామాన్య పౌరుల మాదిరిగానే బ్యాంక్ కి వచ్చి డబ్బు పట్టుకెళ్ళారు. ఆమె చాలా వృద్దురాలు కావడంతో, వృద్దులు, వికలాంగుల కోసం బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో ఆమె డబ్బు మార్చుకొని వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి తల్లి అయినప్పటికీ ఆమె ఎటువంటి దర్పమూ ప్రదర్శించకుండా, తనకి రాచమర్యాదలు జరగాలని ఆశించకుండా ఒక సామాన్యపౌరురాలు మాదిరిగానే బ్యాంక్ కి వచ్చి డబ్బు తీసుకువెళ్ళడం చాలా గొప్ప విషయమే. ఆమెని చూసి మన నాయకులు, ప్రముఖులు సిగ్గుపడాలి.