తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటుకి ప్రోత్సాహకాలు అందజేస్తుండటమే కాక వాటి ఏర్పాటులో ఎదురయ్యే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటం చాలా అభినందనీయం. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారీలో అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన ఫాక్స్ కాన్ కంపెనీ రంగారెడ్డి జిల్లా, కొంగరకలాన్‌లో 120 ఎకరాల విస్తీర్ణంలో భారీ పరిశ్రమని ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఆ శాఖ ఉన్నతాధికారులు కొంగరకలాన్‌కి వెళ్ళి ఆ పరిశ్రమని సందర్శించారు, అక్కడే ఆ సంస్థ కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిపారు. ఆ తర్వాత వీడియో కాన్ఫర్నెస్ ద్వారా ఆ సంస్థ సీఈవో, ఛైర్మన్ సిడ్నీ ల్యూతో సమావేశమయ్యారు.
తమ సంస్థ ఏర్పాటుకి తెలంగాణ ప్రభుత్వం చాలా సహకరిస్తోందని అందుకు ధన్యవాధాలు తెలిపారు. అయితే చైనా నుంచి కొంత మంధి నిపుణులు రావలసి ఉందని వారికి వీసాలు ఆలస్యమవుతున్నాయని, అలాగే చైనా నుంచి కొన్ని యంత్ర సామాగ్రి రావలసి ఉండగా వాటికి కస్టమ్స్ విభాగంలో సమస్యలు ఎదురవుతున్నాయని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
తమ సంస్థ విస్తరణకు సిద్దంగా ఉందని కానీ దానికి మరో 60 ఎకరాలు కేటాయించాలని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు సూచించారు. అలాగే ఆ కంపెనీకి మరో 60 ఎకరాలు కేటాయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.