మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో వంద కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటుండగా తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో ఫ్లెక్సీ బ్యానర్ యుద్ధంలో చిక్కుకున్నారు.
దసరా పండుగ సందర్భంగా ధర్మారం పట్టణంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ వర్గీయులు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టారు. అయితే వాటిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు వాటిని చింపేశారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.
మంత్రి కొండా సురేఖ అనుచరులు రేవూరి అనుచరులపై దాడి చేయడంతో వారిలో కొందరు గాయపడ్డారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గీసుకొండ పోలీసులు ఆమె అనుచరులను అదుపులో తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ ఆమె అనుచరులు వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై బైటాయించి నిరసనలు తెలిపారు.
దీంతో ఆ మార్గంలో చాలాసేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని శాంతింపజేయడానికి ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో మంత్రి కొండా సురేఖకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే అక్కడకు చేరుకొని వారిని మందలించి దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు గురించి అడిగి తెలుసుకున్నారు.