తెలంగాణలో కులగణనకి జీవో జారీ

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినందున దాని కోసం సీఎస్ శాంతికుమారి శనివారం జీవో జారీ చేశారు. ఈ సర్వేలో భాగంగా సంబంధిత అధికారులు లేదా సిబ్బంది రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి సమాచారం సేకరించి రికార్డ్ చేయాలని సూచించారు.

కానీ కులగణన పేరుతో చేపట్టబోతున్న ఈ సర్వేలో కేవలం ప్రజల కుల సమాచారం మాత్రమే కాకుండా వారి సామాజిక, రాజకీయ, ఆర్ధిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని సైతం సేకరించనున్నారు. నేటి నుంచి 60 రోజులలో ఈ సర్వే పూర్తి చేయాలని గడువు విధించారు. 

ఇదే సమయంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో సాధకబాధకాలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ కమీషన్‌ షమీమ్ అక్తర్‌తో ఏకసభ్య కమీషన్‌ ఏర్పాటు చేసింది. దీనికీ 60 రోజులు గడువు విధించింది.

కనుక రాష్ట్రంలో కుల గణన సర్వే నివేదిక, ఈ ఏకసభ్య కమీషన్‌ నివేదిక రెండూ ఇంచుమించు ఒకే సమయంలో ప్రభుత్వం చేతికి వస్తాయి. వాటిని బట్టి ప్రభుత్వం విద్యా, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్స్ అమలు చేయగలుగుతుంది.

కానీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులలో కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక 60 రోజుల తర్వాత నివేధికలు ప్రభుత్వం చేతికి వస్తే ఆ తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం.