ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా శనివారం హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 9 ఏళ్ళపాటు నాగ్పూర్ జైలులో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తింది. ఆయన న్యాయపోరాటం ఫలించి బాంబే హైకోర్టు ఆయనని నిర్ధోషిగా ప్రకటించడంతో 2024 మార్చి 5న జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు.
కానీ ఆయన ఆరోగ్యం కుదుటపడకపోగా క్రమంగా క్షీణిస్తూనే ఉంది. కొంతకాలం క్రితం హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి తుది శ్వాస విడిచారు. రచయిత, విద్యావేత్త, మానవ హక్కుల ఉద్యమకారుడు అయిన ప్రొఫెసర్ సాయిబాబా తన మానవ హక్కులను కాపాడుకోవడానికి సుదీర్గమైన న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంతో తాను నిర్దోషినని నిరూపించుకోగలిగారు. కానీ జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసి చివరికి ప్రాణాలు బలిగొంది.