నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన సమస్యలని అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నేటి నుంచి ఎటిఎం మెషిన్లలో రూ. 20,50,500,2,000 నోట్లని అందించబోతోంది. అదే సమయంలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో ప్రజలకి నగదు విత్ డ్రా చేసుకోగల మైక్రో ఎటిఎంలని నేటి నుంచే ఏర్పాటు చేస్తోంది. మైక్రో ఎటిఎం అంటే షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకుల వద్ద కనిపించే ఎటిఎం కార్డు స్వీపింగ్ మెషిన్ లాగ ఉంటుంది. అది చిన్నదిగా ఉంటుంది కనుక, దానిని బ్యాంక్ ప్రతినిధులు ప్రజలవద్దకే వెళ్ళి డబ్బు అందించవచ్చు. కనుక దీని ద్వారా మారుమూల గ్రామాలలో ప్రజలకి కూడా నగదు అందించవచ్చు. నేటి నుంచే దేశవ్యాప్తంగా మైక్రో ఎటిఎంలు అందుబాటులోకి రానున్నాయి.
పాత నోట్లతో చెల్లింపుల గడువుని ఈనెల 24వ తేదీ వరకు పెంచింది. విద్యుత్, ఫోన్ బిల్లులు, ఆస్తి పన్ను, వగైరాలన్నీ అప్పటి వరకు పాత నోట్లతోనే చెల్లించవచ్చు. అంతవరకు పాత నోట్లతోనే రైల్వే టికెట్లు, విమానం టికెట్లు, పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 21వరకు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో పార్కింగ్ ఫీజుని రద్దు చేసింది. నవంబర్ 18 అర్ధరాత్రి వరకు దేశవ్యాప్తంగా టోల్ గేట్స్ ఫీజుని రద్దు చేసింది.
నిన్న హెలికాఫ్టర్ల ద్వారా బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకి నోట్లని అందించింది. నేటి నుంచి దేశంలో అన్ని రాష్ట్రాలకి నగదుని చేర్చేందుకు యుద్దవిమానాలని ఉపయోగించబోతోంది. నోట్ల రద్దు కారణంగా ఎటిఎంల నుంచి డబ్బు తీసుకోవడానికి పరిమితి (రోజుకి రూ.2500) విదించినందున, ప్రజలు చాలాసార్లు ఎటిఎంలని వినియోగించవలసివస్తోంది. కనుక ఈ నెలాఖరు వరకు ఎన్నిసార్లు ఎటిఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకొన్నా ఖాతాదారుల నుంచి బ్యాంకులు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రప్రభుత్వం, ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు నిరంతరం దేశంలో పరిస్థితులని గమనిస్తూ పరిస్థితులకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. కనుక అతి త్వరలోనే ఈ తాత్కాలిక సమస్యలన్నీ మాయమవవచ్చు.