ఒలింపిక్స్‌లో ఓడిపోయినా ఎన్నికలలో గెలిచారుగా!

భారత్‌ కుస్తీ క్రీడాకారిణి వినేష్ ఫోగట్‌ కుస్తీలో ఓడి రాజకీయాలలో విజయం సాధించారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కేవలం 150 గ్రాములు అధిక బరువు ఉన్నందుకు అనర్హత వేటు పడటంతో తృటిలో పతకం చేజార్చుకుని తీవ్ర నిరాశతో భారత్‌ తిరిగివచ్చారు. 

హర్యానాకు చెందిన ఆమె తిరిగి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈరోజూ వెలువడిన ఫలితాలలో ఆమె ఎన్నికలలో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి యోగేష్ కుమార్, ఆమాద్మీ పార్టీ అభ్యర్ధి కవితా రాణిలను ఓడించి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

దీంతో ఆమె పారిస్‌ ఒలింపిక్స్‌లో గెలిచి ఓడినప్పటికీ, రాజకీయాలలో ప్రత్యర్ధులను చిత్తుచిత్తుగా ఓడించారని మీడియా అభివర్ణిస్తోంది. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్ధిపై సుమారు 6,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

అయితే ఈసారి ఎన్నికలలో ఆమె విజయం సాధించిన్నప్పటికీ కాంగ్రెస్‌ ఓడిపోయి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కనుక ఆమె ప్రతిపక్ష బెంచీలో కూర్చోక తప్పదు. అంటే గెలిచినా పూర్తి ప్రయోజనం ఉండదన్న మాట!