కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్లను పునర్వ్యవస్థీకరించి 150 డివిజన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
శుక్రవారం మాదాపూర్‌లో అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సదస్సు-2024 జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగిస్తూ జీహెచ్‌ఎంసీ విభజన గురించి చెప్పారు. ఆ తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం అంటూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానంగా ఈ 10 నెలల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనుల వివరాలను చెప్పారు.
1. రాజేంద్ర నగర్ వద్ద కొత్త హైకోర్టు భవన నిర్మాణం
2. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం
3. మెట్రో విస్తరణ పనులు
4. ఇంటిగ్రేటడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్
5. ఫ్యూచర్ సిటీ, శాటిలైట్ సిటీల ఏర్పాటుకి ప్రణాళికలు
6. నగరంలో ఎలివేటడ్ కారిడర్లు నిర్మాణానికి ప్రణాళికలు
7. హైడ్రాతో ఆక్రమణలు తొలగించి చెరువులు, నాలాలు పునరుద్దరణకు కృషి
8. మూసీ నది ప్రక్షాళన
9. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకి కృషి
10. జీహెచ్‌ఎంసీని నాలుగు కార్పొరేషన్లుగా విభజించేందుకు సన్నాహాలు.