పాత నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆందోళన, వ్యతిరేకత ప్రదర్శించడంపై భాజపా ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద బారీగా నల్లధనం ఏమైనా ఉందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నల్లధనంతోనే నడుస్తోందా... రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నల్లధనం పైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నారా...లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? అని నాగం ప్రశ్నించారు.
నోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ఖజానాకి బారీగా ఆదాయం కోల్పోతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేయడానికి అదే అర్ధం అని నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇప్పుడు తన తప్పుని కప్పి పుచ్చుకొనేందుకు కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తున్నారని జనార్ధన్ రెడ్డి అన్నారు.
మోడీ తీసుకొన్న నిర్ణయం వలన యావత్ దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడబోతుంటే, కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్త దెబ్బ తింటుందని ఏవిధంగా చెపుతున్నారని నాగం ప్రశ్నించారు. మోడీ తీసుకొన్న ఈ సాహసోపేతమైన నిర్ణయం వలన అంతిమంగా రాష్ట్రాలే ఎక్కువ లాభపడతాయని నాగం చెప్పారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో బారీగా అవినీతికి పాల్పడుతూ, ప్రజాధనం దోచుకొంటున్న తెరాస సర్కార్ కి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదని నాగం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి గురించి గతంలో తాను న్యాయపోరాటాలు కూడా చేశానని వాటిని ఆధారాలతో సహా నిరూపించగలనని, అందుకు తెరాస సర్కార్ సిద్దమా? అని నాగం జనార్ధన్ రెడ్డి సవాలు విసిరారు. నాగం జనార్ధన్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నలకి తెరాస సర్కార్ ఏమని సమాధానం చెపుతుందో?