ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆమెతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియా తదితరులు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో వారందరికీ కొన్ని వారాల క్రితమే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు విచారణ ముగిసిన తర్వాత ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది.
ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై గత 11 ఏళ్ళుగా కోర్టు విచారణ జరుగుతూనే ఉంది. నేటికీ వాయిదాలు పడుతూనే ఉన్నాయి. అదేవిదంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కూడా గత 5 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఆ లెక్కన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కూడా మరో 5-10 ఏళ్ళు సాగే అవకాశం కనిపిస్తోంది. కనుక కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ ఇక చింతించాల్సిన అవసరం లేదు.