తెలంగాణలో గిరిజన ప్రాంతాలకు బైక్‌ అంబులెన్స్‌లు

రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలతో కాలక్షేపం చేస్తుంటాయి తప్ప ప్రజలు తమని ఎందుకు ఎన్నుకొని అధికారం కట్టబెట్టారో? ప్రజలు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో? వారి సమస్యలు ఏమిటో సీతక్క వంటివారు ఒకరిద్దరు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోరు. 

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి కూడా అటువంటి గొప్ప అవకాశం లభించింది. దానిని ఆయన సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో , అడవుల్లో తండాలలో ఉంటున్నవారికి సైతం సకాలంలో వైద్య సేవలు అందించాలని పట్టుదలగా ఉన్నారు. 

గురువారం హైదరాబాద్‌లో దామోదరం సంజీవయ్య భవన్‌లో సంబందిత శాఖల కార్యదర్శులు, కమీషనర్లతో సమావేశమయ్యి అనేక విలువైన సూచనలు చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

• ఐటీడీఏల పరిధిలో గిరిజనులు నివాసం ఉండే అన్ని ప్రాంతాలకు తక్షణ వైద్య సేవ అందించేందుకు, సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోగులను తరలించేందుకు ‘బైక్‌ అంబులెన్స్’లు ఏర్పాటు చేయాలి. 

• ప్రజల అవసరాల మేరకే ‘బైక్‌ అంబులెన్స్’లు ఏర్పాటు చేయాలి తప్ప రాజకీయ ఒత్తిళ్ళతో కాదు. 

• గిరిజన భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని నియమించాలి. 

• దట్టమైన అడవులలో, మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్నవారిలో గర్భిణీ మహిళల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ, వారిని నాలుగైదు రోజులు ముందుగానే జిల్లాలో సమీపంలోని ప్రభుత్వాసుపత్రులలో చేర్పించాలి. 

• ప్రతీ గిరిజన తండాలో కనీసం ఇద్దరు వ్యక్తులకు ప్రధమ చికిత్స శిక్షణ ఇవ్వాలి.      

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమీషనర్‌ ఆర్‌వీ కర్ణన్, వైద్య విధాన పరిషత్ కమీషనర్‌గా జె అజయ్ కుమార్‌, ప్రజారోగ్యశాఖ కన్వీనర్ రవీందర్ నాయక్, ట్రైకార్ ఛైర్మన్‌ బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదివరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బైక్‌ అంబులెన్సులు ప్రవేశపెట్టారు. కానీ వాటిపై ప్రభుత్వం శ్రద్ద చూపకపోవడంతో ఆశించిన ఫలితాలు లభించలేదు. కనుక ఇప్పుడు దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయాలు అమలుచేసి చూపితే మారుమూల ప్రాంతాలలో నివశిస్తున్న గిరిజనుల పాలిట ఆయన నిజంగా దేవుడే అవుతారు.