ఈ మద్య కాలంలో హైడ్రా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కానీ ఇప్పుడు దాని స్థానంలో మంత్రి కొండా సురేఖ నిలుస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్లో అందరూ పోటాపోటీగా ఆమెని విమర్శిస్తున్నారు. ఓ పక్క అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేయగా, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆమె క్షమాపణలు చెప్పకపోతే దావా వేస్తానని హెచ్చరిస్తున్నారు. కానీ సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఆమెకు అండగా నిలబడటం లేదు.
అయినప్పటికీ ఆమె ఏమాత్రం జంకకుండా కేటీఆర్ మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆవేశంతో నోటికి వచ్చిన్నట్లు ఆరోపణలు చేయడం వలననే ఇన్ని విమర్శలు, కేసులు ఎదుర్కోవలసివస్తోందని గ్రహించినప్పటికీ మళ్ళీ నోరు జారడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈసారి ఏమన్నారంటే, “కేటీఆర్‌కి పదవీ కాంక్ష చాలా ఎక్కువ. కనుక ఫామ్‌హౌస్‌లో ఉంటున్న తండ్రి కేసీఆర్ కాళ్ళు విరగొట్టాడో లేదా తలకాయ పగులగొట్టి లోపల గొయ్యి తీసి పూడ్చిపెట్టారో అని అనుమానంగా ఉంది. చాలా నెలలుగా మనిషి కనబడకపోతే అనుమానం కలుగుతుంది కదా? కనుక మనం అందరం కేసీఆర్ బాగుండాలని కోరుకుందాము,” అని కొండా సురేఖ అన్నారు.
ఇదివరకు చేసిన వ్యాఖ్యలకు ఆమెను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరితే, ఆమె క్షమాపణలు చెప్పకపోగా మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేసి ఆయనకు మరోసారి దొరికిపోయారని అర్దమవుతూనే ఉంది. కనుక పరువు నష్టం దావా కేసులో ఈ తాజా వ్యాఖ్యలు కూడా చేర్చుతారేమో?