మోడీకి అవగాహనరాహిత్యం: ఉత్తమ్

నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు చాలా ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తుండటం సహజమే. దానిని దేశంలో ప్రతిపక్షాలన్నీ తమకి అనుకూలంగా మలుచుకొని ఈ అంశం నుంచి రాజకీయ మైలేజి పొందాలని చాలా తాపత్రయపడుతున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేచి నిలబడేందుకు విశ్వా ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సమయంలో దానికి మోడీ తీసుకొన్న ఈ నిర్ణయం గొప్ప ఆయుధంగా దొరకడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగిపోయింది. ఆంధ్రా, తెలంగాణా పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడబలుకొన్నట్లుగా చాలా హడావుడి చేస్తున్నారు. నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల తరపున పోరాడుతూ వారిని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

రఘువీరా రెడ్డి తన పార్టీ నేతలతో కలిసి నిన్న అనంతపురంలో బ్యాంకు ముందు ధర్నా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ అబిడ్స్ సెంటరులో నిన్న నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసే కార్యక్రమంలో పాల్గొని హడావుడి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దుందుడుకుగా తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయం వలన దేశంలో ఆర్ధిక ఎమర్జన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మోడీ నిర్ణయం అవగాహనా రాహిత్యం, అసమర్దతకి నిదర్శనమని అన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనం వెనక్కి రప్పించలేకనే నరేంద్ర మోడీ ఈ సరికొత్త డ్రామా మొదలుపెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయంతో దేశంలో నల్లధనం బయటకి వస్తుందని మోడీ చెపుతున్నారని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బయటకి రాలేదని, కానీ మోడీ మాత్రం ఇది ఒక అద్భుతమైన, సాహాసోపెతమైన నిర్ణయమని గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. అది ఒక అనాలోచితమైన, తెలివి తక్కువ పిచ్చి ఆలోచన అని, దాని వలన దేశంలో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.