మంత్రి సురేఖకు కొండంత కష్టాలు

రాజకీయాలు లేదా సినీ పరిశ్రమలో ఉన్నవారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక్క మాట తప్పుగా మాట్లాడినా అందరూ వేలెత్తి చూపుతూ విమర్శలు గుప్పించడం మొదలుపెడతారు. 

మంత్రి కొండా సురేఖ ఆవిదంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ని విమర్శించే ప్రయత్నంలో అక్కినేని నాగార్జున కుటుంబం గురించి, నటి సమంత గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని సమంతకి క్షమాపణలు చెప్పారు. కానీ అక్కినేని నాగార్జున, కేటీఆర్‌కి క్షమాపణలు చెప్పలేదు.

ఆమె క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ హెచ్చరించగా, ఆయన కంటే ముందు అక్కినేని నాగార్జున నేడు నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. 

ఆమె తమ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విదంగా మాట్లాడినందుకు పరువు నష్టం దావా వేసిన్నట్లు తెలియజేస్తూ ఆ కేసు తాలూకి పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడో రేపో ఆమెకు నోటీసులు అందుతాయి. ఈలోగా కేటీఆర్‌ కూడా కేసు వేసి నోటీస్‌ పంపిస్తే మంత్రి కొండా సురేఖ ఈ రెండు కేసుల నుంచి బయటపడటం చాలా కష్టమే.