మీ ఫామ్‌హౌస్‌లు కూలిపోతాయనే ఈ డ్రామాలు!

హైడ్రా కూల్చివేతలపై బీజేపీ, బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి వారికి తొలిసారిగా ఘాటుగా బదులిచ్చారు. గురువారం సికింద్రాబాద్‌లోని సిఖ్ కాలనీలో డిజిటల్ హెల్త్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంబించారు. 

ఈ సందర్భంగా ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేటీఆర్‌, హరీష్ రావు మూసీ నది పేరుతో ఇంకెంత కాలం నీచరాజకీయాలు చేస్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు కదా? మీరు చేయలేకపోయిన పనిని మేము చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు?

అసలు ఈ అంశంపై, హైడ్రా ఏర్పాటుపై శాసనసభలో చర్చించినప్పుడు ఎందుకు సలహాలు, సూచనలు ఇవ్వలేదు? ఇప్పటికైనా మీరు ఏమైనా చెప్పడలిస్తే సచివాలయానికి రండి. అందరం కూర్చొని మూసీ ప్రక్షాళన ఏవిదంగా చేయాలో, నిర్వాసితులకు ఏవిదంగా ఆదుకోవాలో చర్చిద్దాము.

కేటీఆర్‌, హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి తదితర బిఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లు కూల్చివేస్తామనే భయంతోనే వారు మూసీ పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. బిఆర్ఎస్ నేతలు మాట్లాడగానే బీజేపీ నేతలు వచ్చి మళ్ళీ అదే మాట్లాడుతారు. అంటే రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యి మూసీ రాజకీయాలు చేస్తున్నారు. 

హైదరాబాద్‌ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. కానీ కేంద్రం నుంచి తెలంగాణకి ఒక్క రూపాయి తేలేకపోయారు. ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌లో సబర్మతీ నదిని ప్రక్షాళనం చేసుకొని సుందరీకరణ చేయవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం మూసీ నదిని చేయకూడ దా?

బీజేపీ ఎంపీలకు దమ్ముంటే నాతో కలిసి ఢిల్లీకి రండి. ప్రధాని నరేంద్రమోడీని కలిసి తెలంగాణకి ఓ 25,000 కోట్లు ఇవ్వాలని కోరుదాము. అంతే తప్ప మూసీ పేరుతో నీచ రాజకీయాలు చేయొద్దు,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.