అత్యాచార ఆరోపణలో ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి మద్యంతర బెయిల్ లభించింది. ఆయనకు జాతీయ అవార్డు ప్రకటించినందున దానిని స్వీకరించేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుని అభ్యర్ధించగా సానుకూలంగా స్పందించింది.
ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలు విలువ కలిగిన రెండు పూచీకత్తులు సమర్పించాలని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఈ కేసు గురించి ఎవరితో మాట్లాడరాదని, ఈ కేసు గురించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని న్యాయస్థానం షరతులు విధించింది.
అక్టోబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టుకి వచ్చి లొంగిపోవాలని, ఆ తర్వాత మళ్ళీ బెయిల్ కోసం దరఖాస్తు చేయరాదని షరతులు విధించింది. అందుకు జానీ మాస్టర్ అంగీకరించడంతో న్యాయస్థానం నాలుగు రోజులు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.
తమిళంలో 'తిరుచిట్రంబళం' సినిమాకి ఆయన చేసిన కొరియోగ్రఫీకి జాతీయ అవార్డుకి జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీలో జరిగే 70వ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఈ అవార్డు అందుకోబోతున్నారు.