మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కూడా ఘాటుగా స్పందించారు. “ గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను,” ని ట్వీట్ చేశారు.
మంత్రి కొండా సురేఖ బహుశః తన వ్యాఖ్యలపై ఇంత దుమారం చెలరేగుతుందని ఊహించి ఉండరు. కానీ అందరూ ఆమె తీరుని తప్పుపడుతుండటంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. కనుక సినీ పరిశ్రమ ఇంతటితో శాంతిస్తుందనే భావించవచ్చు.
కానీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె తనకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. కానీ ఆమె కేటీఆర్‌కి క్షమాపణ చెప్పకపోవడం గమనిస్తే రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నట్లున్నారు.
ఆమె ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా మాట్లాడారు. ఇప్పటికే ఆ కేసు విచారణ జరుగుతోంది. కనుక కొండా సురేఖ ధైర్యంగా కేటీఆర్‌ని ఎదుర్కొనే అవకాశం ఉంది.