మంత్రి కొండా సురేఖ నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని విమర్శించే క్రమంలో నాగ చైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి ఆయనే కారణమని, సినీ పరిశ్రమ మాదక ద్రవ్యాలు, హీరోయిన్ల వేధింపులు అన్నిటి వెనుక కేటీఆర్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకాలం తమ విడాకుల గురించి నోరు విప్పని నాగ చైతన్యతో పాటు సమంత, జూ.ఎన్టీఆర్, నాని తదితరులు కూడా చాలా ఘాటుగా స్పందించారు.
నాగ చైతన్య: “జీవితంలో విడాకులు అత్యంత భాధాకరమైన, కటినమైన నిర్ణయం. ఈ విషయంలో చాలా ఆలోచించిన తర్వాతే పరస్పరం అంగీకారంతో మేము విడిపోయాము. మా విడాకులపై అనేక నిరాధారమైన వ్యాఖ్యలు వినిపించాయి కానీ ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం హాస్యాస్పదంగా ఉన్నాయి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు,” అని అన్నారు.
సమంత: “విడాకులు నా వ్యక్తిగత విషయం. కనుక దాని గురించి ఊహాగానాలు చేయవద్దని అభ్యర్ధిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి ఒంటరిగా నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. నా ఈ ప్రయాణంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అందుకు గర్వపడుతున్నా.
మంత్రిగా మీ మాటలకు ఓ విలువ ఉంటుంద గ్రహించి, ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కోరుతున్నాను. ఇతరులపట్ల ఇటువంటి మాటలు సరికాదు.
నా విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయి. దీనిలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరుని రాజకీయాలలోకి లాగొద్దు. నేను వాటికి ఎప్పుడూ దూరంగానే ఉంటాను,” అని అన్నారు.
జూ.ఎన్టీఆర్: “ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీరు మాట్లాడిన ఈ మాటలు రాజకీయాలలో అత్యంత నీచమైనవిగా భావిస్తున్నా. ప్రజా జీవితంలో ఉన్న మీవంటివారు హుందాగా, గౌరవంగా వ్యవహరించాలి. కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారి గురించి మీరు ఇంత నిర్లక్ష్యంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.
ఎవరైనా మాపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకొని మౌనంగా చూస్తూ కూర్చోము. ఇటువంటి వాటికంటే మనం ఉన్నతంగా వ్యవహరిస్తూ ఎవరి సరిహద్దులో వారు ఉండాలి. మన ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని సమాజం ఉపేక్షించదు.
నాని: “రాజకీయ నాయకులు దేని గురించి ఏదైనా మాట్లాడేయవచ్చనే మీ ధోరణి చాలా దిగజారుడుతనాన్ని సూచిస్తోంది. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత మూర్ఖంగా మాట్లాడిన మాటలు విన్నప్పుడు మీరు ప్రజల పట్ల బాధ్యతగా ఉంటారని ఆశించలేము.
ఇది కేవలం సినీ నటులో లేదా రాజకీయపార్టీల గురించి మాత్రమే కాదు. గౌరవ ప్రదమైన హోదాలో ఉంటూ ఈవిదంగా ఎవరు మాట్లాడినా తప్పే. మనం మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా చెల్లుతుందనుకోవడం తప్పే. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి ధోరణిని అందరూ ఖండించాలి,” అని ట్వీట్ చేశారు
ప్రకాష్ రాజ్: ”ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? #జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్: “ఫోన్ ట్యాపింగ్, తదితర అంశాల గురించి కొండా సురేఖగారు మాట్లాడిన మాటలని నేను ఖండిస్తున్నా. వాటితో నాకు ఎటువంటి సంబందమూ లేదు. ఆమె ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే అబద్దాలు మాట్లాడారు. ఆమె ఆరోపణలు నిజమని ప్రజలు భావించవచ్చు. అందుకే నేను స్పందిస్తున్నా... ఆమె ఆరోపణలను ఖండిస్తున్నా. ఆమె తక్షణమే క్షమాపణలు చెప్పాలి. లేకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు కూడా వేస్తాను,” అని హెచ్చరించారు.