నల్గొండకి చెందిన డా. బి.సంద్యారాణి మృతికి కారకురాలైన గుంటూరు మెడికల్ కళాశాల అధ్యాపకురాలు ప్రొఫెసర్ లక్ష్మిని ఈరోజు పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. గైనకాలజీలో పిజి చేస్తున్న 27సం.ల బి. సంద్యారాణిని ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు భరించలేక అక్టోబర్ 22న ఆత్మహత్య చేసుకొంది. ఆమె మరణవార్తని తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కానీ రక్షించబడ్డాడు.
సంద్యారాణి ఆత్మహత్య చేసుకొన్న తరువాత పోలీసులు ఆమె డైరీని స్వాధీనం చేసుకొని పరిశీలించగా ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు భరించలేకనే తను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు స్పష్టంగా దానిలో వ్రాసింది. ఆమె తన భర్తకి వ్రాసిన ఉత్తరంలో కూడా అదే వ్రాసింది. పోలీసులు ప్రొఫెసర్ లక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టగానే ఆమె ముందస్తు బెయిలు జోసం ప్రయత్నించింది కానీ దొరకకపోవడంతో ఊరు వదిలి పారిపోయింది. ఆమెని అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలంటూ అప్పటి నుంచి మెడికోలు ధర్నాలు చేస్తున్నారు. కానీ ప్రొఫెసర్ లక్ష్మికి చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఆమె అరెస్ట్ కాకముందే తప్పించుకొని పారిపోగలిగింది.
దీనిపై స్పందించిన మంత్రి కేటిఆర్ ఏపి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి సంధ్య మృతికి కారకులైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేసి ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈవిషయం తెలియజేయడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బెంగళూరులో ఉన్న ఆమెని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. అంటే ప్రభుత్వం తలుచుకొంటే క్షణాలలో ఆమెని పట్టుకోగలదని అర్ధం అవుతోంది.