ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మద్య వరుసగా పెళ్ళి పిలుపులు వస్తున్నాయి. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా తన తండ్రిని వెంటబెట్టుకొని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి తన చెల్లెలి వివాహానికి ఆహ్వానించింది. ఈరోజు ప్రముఖ నటుడు నాగార్జున డిశంబర్ 9న జరుగబోయే తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్ధ వేడుకకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అదే సమయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా అక్కడికి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రిని తన కుమార్తె పెళ్ళికి ఆహ్వానించారు.
నాగ చైతన్య కంటే అఖిల్ చిన్నవాడైనప్పటికీ ముందుగా అతని వివాహమే జరిపించబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా హైదరాబాద్ లో కాదు...ఇటలీలోని రోమ్ నగరంలో. అఖిల్ ఫేషన్ డిజైనర్ శ్రీయ భూపాల్ ని ప్రేమించాడు. వారి ప్రేమనే కాదు..డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనే వారి చిరు కోరికని కూడా ఇరు పక్షాల పెద్దలు అంగీకరించడంతో రోమ్ లో వారి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో అఖిల్-శ్రీయ భూపాల్ పెళ్ళి జరిగే అవకాశం ఉంది. వారి వివాహానికి దేశ విదేశాల నుంచి సుమారు 600 మంది అతిధులు హాజరుతారని సమాచారం. నిశ్చితార్ధం తరువాత ఆ వివరాలు బయటకి వస్తాయి.