నేడు హైదరాబాద్‌లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్ వద్దగల నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం చేరుకొని 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. 

అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకొని అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో ఆదివారం నుంచి 8 రోజుల పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 

వీటిలో ఆయా రాష్ట్రాలకు చెందిన 43 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు. సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమాలను చూడవచ్చు. అయితే రాష్ట్రపతి నిలయం అధికారిక వెబ్‌సైట్‌లో కానీ లేదా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. 

నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం వరకు రెండు గంటల సేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.